Monday, 12 June 2017

సినారె ఇక లేరు

సినారె ఇక లేరు


ఆధునిక తెలుగు సాహిత్యానికి వన్నెలద్దిన గొప్ప రచయిత. తెలుగు సినిమా పాటలకు కొత్తసొబగులు అద్దిన మాంత్రికుడు. పద్యం, గేయం, వచనం, పాట, గజల్, బుర్రకథ ఇలా సాహిత్య ప్రక్రియ ఏదైనా ఆయన కలం నుంచి జాలువారే ప్రతి అక్షరమూ ఒక ఆణిముత్యమే. ఆయనే ప్రముఖ రచయిత డాక్టర్ సి. నారాయణరెడ్డి. మనమంతా సినారె అని పిలుచుకునే బహుముఖ ప్రజ్ఞాశాలి ఇప్పుడు మన మధ్య లేరు.


 
సి. నారాయణ రెడ్డి పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి. ఆయన 1931 జులై 29న కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో జన్మించారు. ఆయన చదువంతా ఉర్దూ మాధ్యమంలో సాగినప్పటికీ తెలుగు సాహిత్యంపట్ల మక్కువ పెంచుకున్నారు. పల్లెపదాలు, వినోదాలు, కథాగానంపై ఇష్టం పెంచుకోవడంతో పాటు చిన్నతనంలోనే కవితా ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1953లోనే ‘నవ్వని పువ్వు’ పేరుతో తొలి కవితా సంపుటిని వెలువరించి అందరి మన్ననలూ అందుకున్నారు.
 
తరువాత విశ్వగీతి, నాగార్జునసాగరం, స్వప్నభంగం, కర్పూర వసంతరాయలు వంటి కవితా సంపుటాలు రచించారు. 1962లో కళాశాల అధ్యాపకుడిగా ఉన్న సమయంలో నటసార్వభౌమ ఎన్టీఆర్ కోరిక మేరకు ‘గులేబకావళి కథ’ సినిమా కోసం తొలిసారి పాట రాశారు. ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని..’ అంటూ సినారె రాసిన తొలిపాటనే ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఇక ఆయన వెనుదిరిగి చూడలేదు. మూడు వేలకు పైగా పాటలు రాసి తెలుగు చిత్రసీమలో చెరగని ముద్ర వేశారు.
 
అప్పటి నుంచి ఇప్పటి వరకు 3వేల 5వందల సినిమాలకు పాటలు రాశారు. సి నారాయణరెడ్డి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడిగా, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారుగా, రాష్ట్ర సంస్కృతిక మండలి అధ్యక్షుడిగా ఏడేళ్లు పనిచేశారు.
 
ఆత్మబంధువు, గులేబకావళి కథ, కులగోత్రాలు, రక్తసంబంధం, బందిపోటు, చదువుకున్న అమ్మాయిలు, కర్ణ, లక్షాధికారి, పునర్జన్మ, తిరుపతమ్మకథ, అమరశిల్పి జక్కన, గుడిగంటలు, మంచి మనిషి, మురళీకృష్ణ, రాముడు భీముడు, మంగమ్మ శపథం, పరమానందయ్య శిష్యుల కథ, బందిపోటు దొంగలు, బంగారుగాజులు, వరకట్నం, ఏకవీర సినిమాలకు పాటలు రాశారు. ధర్మదాత, కోడలు దిద్దిన కాపురం, లక్ష్మీకటాక్షం, చెల్లెలికాపురం, మట్టిలో మాణిక్యం, బాలమిత్రుల కథ, మానవుడు దానవడు, తాతమనవడు, అందాలరాముడు, శారద, అల్లూరి  సీతారామరాజు వంటి సినిమాలకు సూపర్ హిట్ పాటలు అందించారు.తెలుగులో విశ్వనాధ సత్యనారాయణ తరవాత జ్ఞానపీఠ్ అందుకున్న కవి సినారె. సాహిత్యంలో విశేష సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించింది.


No comments:

Post a Comment